Distraction Free Reading

ప్లాట్‌ఫారమ్ కార్మికుల సమిష్టీకరణ పయనం: యూనియన్ నిర్వాహకుల నుండి పరిశోధకులకు సందేశాలు

శృతి వింజమూరి అనువదించారు[1]

‘లేబర్ టెక్ రీసెర్చ్ నెట్‌వర్క్’ సభ్యులు రాసిన, భారతదేశంలోని గిగ్ మరియు ప్లాట్‌ఫారమ్ కార్మికుల సంఘాలకు సంబంధించిన వరుస కథనాలలో ఇది ఐదవది. ఈ సిరీస్ పరిచయ కథనాన్ని ఇక్కడ, రెండవ కథనాన్ని ఇక్కడ, మూడవ కథనాన్ని ఇక్కడ మరియు నాలుగవ కథనాన్ని ఇక్కడ చదవండి. పైన పేర్కొన్న కథనాలన్నీ ఆంగ్లంలో ఉన్నాయి.


“ప్లాట్‌ఫారమ్ వర్క్” (సులువుగా చెప్పాలంటే, ఒక ఆన్లైన్ అప్-ఆధారితంగా చేసే పని ఏదైనా) పై వస్తున్న కొత్త పరిశోధనలలో సమిష్టీకరణ, యూనియనిజేషన్, మరియు ప్లాట్‌ఫారమ్ కార్మికుల ప్రతిఘటన పోరాటాలు ముఖ్యమైన అంశాలుగా నిలుస్తున్నాయి. పరిశోధకులు, ప్లాట్‌ఫారమ్ కార్మికులు, మరియు గిగ్ వర్కర్ (gig worker) యూనియన్‌ల మధ్య ఉత్సాహకరమైన కొత్త కొలాబొరేషన్స్ జరుగుతున్నాయి. ఈ రంగంలో మరింత మంది పరిశోధకులు పాలుపంచుకోవడంతో, ఎన్నో పరిశోధకులు ఇంటర్వ్యూలకు గానీ, ఇతర రకాల సమాచార సేకరణ కోసం కానీ గిగ్ కార్మికులను ఎక్కువగా సంప్రదంచడం జరుగుతుంది. దీని వలన ఈ కార్మికులకు ఒకింత ఇబ్బంది కలగడం వాస్తవమే. అయినా సరే, పరిశోధకులు కేవలం స్వీయ లక్ష్యాల కోసమే కాకుండా, గిగ్ కార్మికులతో కొల్లబోరేట్ అయి శ్రద్ధగా వాళ్ల అవసరాలను తెలుసుకుంటూ పరిశోధనలు చేస్తే, ఆయా కార్మికులకు ప్రాథమిక కార్మిక హక్కులను మరియు పని గౌరవాన్ని సాధించడానికి తోడ్పడే అవకాశం ఉంటుంది.

ఇది సాధించాలంటే, పరిశోధకులు అనేవాళ్ళు కేవలం ఈ గిగ్ కార్మికులు, యూనియన్ నిర్వాహకులు, సహరకార సంఘాల గురించి పరిశోధన చెయ్యడమే కాకుండా, వాళ్లతో కలిసి, వాళ్లను పరిశోధనలో భాగస్వాములను చేస్తూ తమ పరిశోధనలు ముందుకు తీసుకువెళ్లాలసిన అవసరం ఉంది. ఇటీవల, చాలా మంది పరిశోధకులు ఈ విధంగా గిగ్ కార్మికులతో, వారి యూనియన్ల సహకార సంఘాలతో కలిసి పనిచేసే పద్ధతులను అవలంబిస్తున్నారు. ఈ ధారావాహికలోని చివరి వ్యాసంలో, అటువంటి ప్రక్రియలను బలోపేతం చేసే లక్ష్యంతో, మేము భారతదేశానికి చెందిన ముగ్గురు గిగ్ వర్కర్ యూనియన్ నిర్వాహకులతో మాట్లాడాము: మంజు గోయల్, అబ్దుల్ నయీం, మరియు జావేద్. ప్లాట్‌ఫారమ్ కార్మికులను సమిష్టీకరణ  చేయడంలో పరిశోధకుల పాత్రను వారు ఎలా చూస్తారు? ప్లాట్‌ఫారమ్ కార్మిక యూనియన్లకు పరిశోధకులు ఏ విధాలుగా మద్దతు ఇవ్వగలరు? ఇటువంటి కొలాబొరేషన్స్ ప్రారంభించేటప్పుడు మనం ఏమి గుర్తుంచుకోవాలి? — ఈ ప్రశ్నలను మేము వారిని అడిగాము.

మూడు సంభాషణలూ హిందీలో జరిగాయి. మేము ప్రతి కార్మిక సంఘ నిర్వాహకుడి ప్రతిస్పందనలను ఒకే వ్యాసంగా సంకలనం చేసి, అవసరమైన చోట సందర్భాన్ని జోడించి, వాటిని ఆంగ్లంలోకి అనువదించి, నిడివి మరియు ప్రవాహం కోసం తేలికగా సవరించాము. ఆ తర్వాత పూర్తి పోస్ట్‌ను హిందీ, కన్నడ మరియు తెలుగు భాషల్లోకి అనువదించి, తుది రూపం ఇచ్చే ముందు వారి ఆమోదం మరియు అభిప్రాయం కోసం మంజు, నయీమ్ భాయ్ మరియు జావేద్‌లతో పంచుకున్నాము.

కార్మికులు, పరిశోధకులు: గిగ్ కార్మికుల హక్కుల పోరాటంలో మిత్రులు

జావేద్ – అంబిక టాండన్‌తో సంభాషణలో

A man in a checkered shirt and blue jeans is balancing a heavy white package on the back of his green electric scooter.

చిత్రం 1: డెలివరీ కోసం తన EVపై పెద్ద పార్సెల్‌ను మోస్తున్న జావేద్. అంబికా టాండన్ తీసిన చిత్రం.

నా పేరు జావేద్. నేను ఒక గిగ్ కార్మికుడిని. నేను చాలా సంవత్సరాలుగా యాప్-ఆధారిత డెలివరీ మరియు రైడ్ సేవల్లో పనిచేస్తున్నాను. ఈ పనిలో మాకు సంపాదన తక్కువగా ఉండటమే కాకుండా, అధిక కమీషన్ రేట్లు, కస్టమర్ల నుండి ఒత్తిడి, ఉద్యోగ ప్రోత్సాహకాలు తరుచుగా మారడం, మరియు భద్రతకు సంబంధించిన సమస్యలు వంటి అనేక రకాల ఇబ్బందులను ఎదురుకుంటున్నాము. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పై సామూహికంగా నిరసన వ్యక్తం చెయ్యాలనే ఉద్దేశంతో వారిని ఏకం చేయడానికి ప్రయత్నిస్తున్న ఒక యూనియన్ గురించి గత సంవత్సరంలో నేను తెలుసుకున్నాను. కార్మికులు ఏకం కావడం అత్యవసరమని నేను భావించాను కాబట్టి వెంటనే దాంట్లో చేరాను. మా యూనియన్ పేరు “రాజధాని యాప్ వర్కర్ యూనియన్”. ఢిల్లీలోని గిగ్ కార్మికుల హక్కులు, మెరుగైన పని పరిస్థితుల కోసం పోరాడుతుంది.

గత సంవత్సరంలో, నేను వందలాది మంది అప్ రైడర్లను కలిశాను. వారి సమస్యలను విన్నాను. వారికి కార్మిక చట్టాల గురించి తెలియజేశాను. కార్మికులు ఏకం కావడానికి మా యూనియన్ లో ప్రధానంగా రైడర్లను ఒకరితో ఒకరు అనుసంధానించడానికి ప్రయత్నిస్తాము. ఈ పని అంత సులభం కాదు. చాలా మంది రైడర్లకు అసలు యూనియన్ అంటే ఏమిటి, అది వారికి ఎలా సహాయపడుతుంది, ఇలాంటివాటి గురించి సరైన సమాచారం ఉండదు. ఇంకొక పెద్ద ఇబ్బంది ఏంటంటే మేము ఉండే భయంతో కూడుకున్న వాతావరణం. వర్కర్స్ ఏదైనా కొంచం గొంతు విప్పినట్లయితే, కంపెనీ వాళ్ల ఖాతాలను బ్లాక్ లేదా డియాక్టివేట్ చేస్తారేమోననే భయం. మూడవ సమస్య ఏమిటంటే, రైడర్ల పని ఎంతో శ్రమతో కూడుకొని ఉండడం ఇంకా చాలా సమయం తీసుకోవడం. మేము రోజంతా ఆర్డర్‌లను పూర్తి చేయాల్సి ఉంటుంది కాబట్టి సమావేశాలకు లేదా ఏదైనా అదనపు కార్యకలాపాలకు అస్సలు సమయం ఉండదు. కొంతమంది రైడర్లు వ్యక్తిగతంగా పనిచేయడమే మంచిదని, సామూహిక పోరాటం వల్ల ఎలాంటి గణనీయమైన మార్పు రాదని భావిస్తూ ఉంటారు.

ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి మొట్టమొదిటగా చెయ్యాల్సింది ఏమిటంటే రైడర్లతో నేరుగా మాట్లాడటం. రైడర్లతో పరిశోధకులు ముఖాముఖిగా మాట్లాడుకున్నప్పుడు, నమ్మకం బలపడుతుంది. వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియా, మరియు చిన్న సమావేశాలు కూడా రైడర్లను కలపడానికి సహాయపడతాయి. కార్మికుల హక్కులు మరియు వారి పనికి సంబంధించిన కార్మిక చట్టాలను సరళమైన భాషలో వివరించడం కూడా ముఖ్యం. యూనియన్లు చిన్న సమస్యలను పరిష్కరించడంలో సహాయపడితే రైడర్ల విశ్వాసం పెరుగుతుంది.

కార్మికులను ఏకం చెయ్యాలంటే ముందుగా వివరించాల్సింది ఏమిటంటే అందరూ కార్మికులు ఒకే రకమైన సమస్యలను ఎదురుకుంటున్న వాస్తవం. మతం, కులం, లేదా లింగంతో సంబంధం లేకుండా, కార్మికులు తక్కువ ఆదాయం, ఉద్యోగ భద్రత లేకపోవడం, మరియు హక్కుల కొరత వంటి సమస్యలను తరచుగా ఎదుర్కొంటారు. మనము అన్నిటికంటే మొదటిగా కార్మికులమని యూనియన్ తెలియజేయాలి. సమావేశాలు గానీ ప్రచారాలలో గానీ ప్రతి ఒక్కరికీ మాట్లాడటానికి, పాల్గొనడానికి అవకాశం ఇవ్వాలి. ఉమ్మడి సమస్యలపై దృష్టి పెట్టాలి. కార్మికులు ఒకరి సమస్యలను మరొకరు అర్థం చేసుకోవడం మొదలెట్టినప్పుడు, పరస్పర విశ్వాసం పెరుగుతుంది. సామూహిక బలం పెరుగుతుంది.

యూనియన్ ఏర్పాటు ప్రక్రియలో పరిశోధకులు కూడా పాత్ర పోషించగలరు. ఈ యాప్స్ లోని  అల్గారిథమ్స్ ఎవరికి ఆర్డర్ వస్తుందో, రైడర్‌కు ఏ రేటింగ్ లభిస్తుందో, ఏ ఖాతా బ్లాక్ చేయబడుతుందో కూడా నిర్ణయిస్తాయి. తమకు ఎందుకు తక్కువ ఆర్డర్లు వస్తున్నాయో రైడర్లు అర్థం కాకుండా మదన పడుతుంటారు. సమయానికి డెలివరీ చెయ్యాలనే ఒత్తిడి కూడా దానికి తోడు ఉంటుంది. రేటింగ్ వ్యవస్థ కూడా రైడర్లు వేగంగా పనిచెయ్యాలనే ఒత్తిడిని పెంచుతాయి. జీతం, ప్రోత్సాహకాలు నిజానికి ఎలా లెక్కించబడతాయో, ఈ అప్ సిస్టం ఎలా పనిచేస్తుందో అధ్యయనం చేయడానికి పరిశోధకులు ఎంతో సహాయపడగలరు. తగిన పోలీసీలను, చట్టాలను రూపొందించడానికి ఈ రకమైన సమాచారం చాలా ముఖ్యం. పరిశోధకులు కార్మికుల గొంతును ప్రభుత్వానికి మరియు సమాజానికి వినిపించేలా కూడా చెయ్యగలరు. పరిశోధన నివేదికలు ప్రచురించబడినప్పుడు, అవి ప్రజాభిప్రాయాన్ని మరియు విధాన రూపకర్తలను ప్రభావితం చేయగలవు.

నా అభిప్రాయం ప్రకారం, పరిశోధకులు కార్మికులతో గౌరవం మరియు నమ్మకంతో పనిచేయాలి. వారు కార్మికుల సమస్యలను కేవలం గణాంకాలుగా కాకుండా, వారి రోజువారీ జీవిత అనుభవాల దృక్కోణంలో చూడాలి. పరిశోధన ఫలితాలను కార్మికులతో పంచుకోవడం కూడా ముఖ్యం. వారి అనుభవాల ను తెలుసుకుని అధ్యయనం చేసి ఏమీ తేల్చుకున్నారో అప్పుడే వారికి తెలుస్తుంది. పరిశోధకులు కార్మికుల వ్యక్తిగత సమాచారం సురక్షితంగా ఉండేలా, వాళ్లు ఎలాంటి ప్రమాదాలు లేదా సమస్యలను భవిష్యత్తులో ఎదుర్కోకుండా చూసుకోవాలి.

పరిశోధకులు-యూనియన్ల పొత్తులను నిర్మించడం

అబ్దుల్ నయీం – అనుశ్రీ గుప్తా మరియు ఈషా కుందూరితో సంభాషణలో

A man with black hair and a white patterned shirt is holding a mike and speaking.

చిత్రం 2: సమావేశంలో మాట్లాడుతున్న నయీం భాయ్. ఫోటో సౌజన్యం: మహమ్మద్ సాబరుద్దీన్. .

అబ్దుల్ నయీం (మేము నయీం భాయ్ అని పిలుస్తాము) హైదరాబాద్‌కు చెందిన స్వతంత్ర కార్మికుల నేతృత్వంలో ఏర్పడిన తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫారమ్ వర్కర్స్ యూనియన్ (TGPWU)లో చురుకైన సభ్యుడు. తాను క్యాబ్ డ్రైవర్ కావడంతో, గిగ్ వర్క్ వాస్తవాలపై తనకున్న పదునైన అవగాహనతో యాప్-ఆధారిత గిగ్ కార్మికులను సమీకరించి, యూనియన్ ప్రచారాలకు మద్దతును కూడగట్టారు. గత 7 సంవత్సరాలుగా అతను నిర్విరామంగా ఈ యూనియన్లో చేరాలనే సందేశాన్ని నగర వీధుల నుండి విమానాశ్రయం పార్కింగ్ స్థలం దాకా  తీసుకువెళ్తున్నారు. డ్రైవర్లకు డ్రాప్ లొకేషన్‌లను కనిపించేలా చేయడానికి, వారపు చెల్లింపు వ్యవస్థను అమలు చేయడానికి చేసిన ప్రచారంలో ఈ యూనియన్ విజయం సాధించింది. దాదాపు మూడేళ్ల నిరంతర పోరాటం తర్వాత, తెలంగాణలో గిగ్ మరియు ప్లాట్‌ఫారమ్ కార్మికుల కోసం వచ్చిన చట్టం వారికి ఇటీవలి గొప్ప విజయం.

ఈ వ్యాసంలో, పరిశోధకులకు మరియు ట్రేడ్ యూనియన్ సభ్యులకు మధ్య పొత్తులు ఎందుకు ముఖ్యమో మేము నయీం భాయ్‌తో కలిసి చేసిన చర్చను మీ ముందుకి తీసుకువస్తున్నాము. 2022-23 నుండి ఈ సంస్థతో కలిసి పనిచేస్తున్నందున, పరిశోధకులు సంస్థలకు ఎలా మద్దతు ఇవ్వగలరనే దానిపై అనేక సంభాషణల ద్వారా మేము స్పష్టమైన అవగాహనను పొందాము.

మొదటగా, పరిశోధన అజెండాలను ముందుగా నిర్ణయించలేకపోయినా కానీ అవి కార్మికుల మారుతున్న పరిస్థితులకు ప్రతిస్పందించాలి. ఉదాహరణకు, చాలా మంది విద్యార్థులు మరియు పల్లె, పట్టణ యువత ఆర్థిక స్వాతంత్ర్యం వస్తుందేమో అనే ఆశతో గిగ్ వర్క్‌కు ఆకర్షితులవుతున్నారని నయీం భాయ్ గమనించారు. అయితే, వాస్తవానికి ఈ పని చాలా అసురక్షితమైనది. AI సాంకేతికతల పెరుగుదల ఈ పని యొక్క అసురక్షిత స్వభావాన్ని మరింత తీవ్రతరం చేస్తోంది. ఈ విషయంలోనే పరిశోధకులు డ్రోన్ డెలివరీల వంటి కొత్త ఫీచర్ల యొక్క పరిణామాలను పరిశీలించడం ద్వారా గిగ్ కార్మికులకు కలిగే ఇబ్బందుల గురించి అవగాహన తీసుకురావాలి. ఉద్యోగాభివృద్ధి ధోరణులపై సాంకేతిక ఆవిష్కరణల దీర్ఘకాలిక ప్రభావాలను, పర్యావరణ న్యాయం (అదే, “క్లైమేట్ జస్టిస్”)తో ప్లాట్‌ఫారమ్ పనికి ఉండే సంబంధాల గురించి పరిశోధకులు పరిశీలించాల్సిన అవసరాన్ని ఎత్తి చూపరు నయీం భాయ్. పరిశోధన ప్రశ్నలను ఎలా ఎంచుకోవాలి అనే ప్రక్రియ గురించి ఆలోచించమని నయీం భాయి మమ్మలన్నీ ప్రోత్సహించారు.

రెండవదిగా, పరిశోధకులు భారతదేశంలో మరియు అంతర్జాతీయంగా ప్లాట్ఫారం కార్మికులకు సంబంధించి మారుతున్న చట్టపరమైన పరిణామాల గురించి – ప్రమాదాలు, గుర్తింపు కార్డుల రద్దు వంటివి – యూనియన్లకు తెలియజేయాలి. తద్వారా పరిహారాలను సరైన మార్గంలో ఎలా చట్టపరంగా పోరాడవచ్చు అనేటువంటి విషయం మీద కూడా అవగాహన వస్తుంది.

టిజిపిడబ్ల్యుయు (TGPWU) తన డిమాండ్లకు ప్రజా మద్దతును కూడగట్టడానికి అనేక పద్ధతులను ఉపయోగిస్తుంది. మొదట, ప్లాట్‌ఫామ్ కంపెనీలతో సమస్యలను ప్రస్తావిస్తారు. ఆ తర్వాత, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తారు. చివరగా, డ్రైవర్లను సమీకరించడం ద్వారా ప్రజా ఒత్తిడిని పెంచుతారు. నయా-ఉదారవాద అభివృద్ధి వ్యవస్థలో ఆహార పంపిణీ లేదా వైద్య శిబిరాల వంటి మానవతా కార్యక్రమాలకు మద్దతు సులభంగా లభించినప్పటికీ, రాజ్యాంగబద్ధమైన కార్మిక హక్కుల పోరాటాలకు మద్దతు పొందడం కష్టం. భారతదేశంలో సామాజిక భద్రతపై చర్చలు పెరుగుతున్న ప్రస్తుత నేపథ్యంలో, పరిశోధకులు మరియు కార్మిక సంఘాలు ప్లాట్‌ఫామ్ కార్మికుల హక్కుల గురించి కూడా ప్రశ్నలు మరియు చర్చలను లేవనెత్తాలి.

అంతర్జాతీయ చట్టపరమైన పోరాటాలు, కార్మికుల ప్రత్యక్ష అనుభవాలు మరియు కార్మిక సంబంధిత సైద్ధాంతిక పునాదులపై పరిశోధకుల అవగాహనను, కార్మికులు మరియు పరిశోధకుల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి ఉపయోగించవచ్చు.

చివరగా, పరిశోధకులు, గిగ్ వర్కర్లు పరస్పర సహకారంతో చేసే పనిని సింపుల్ గా “బెస్ట్ ప్రాక్టీసెస్” లేదా “యాక్షన్ రీసెర్చ్” అని నామకరణం చేసే ప్రయత్నాలను మనం అధిగమించాలి. దానికి బదులుగా, క్షేత్రస్థాయి పొత్తులను నిర్మించడం అనేది ఒక నిరంతర మేధోపరమైన ప్రక్రియ అని, దానితో పాటు వచ్చే సంక్లిష్టతను అర్థం చేసుకుని, అంగీకరించి పొత్తులను నిర్మించుకోవాలని మనం గుర్తించాలి (నాగర్ మరియు ఇతరులు, 2019).

పరిశోధకులకు మరియు గిగ్ నిర్వాహకులకు మధ్య సృజనాత్మక సహకారాలు

ఇషా భల్లముడితో సంభాషణలో మంజు గోయల్

Two women, one in a yellow saree and the other in a blue saree, are standing next to each other and smiling at the camera. One of them has a conference lanyard around her neck.

చిత్రం 2: సమావేశంలో మాట్లాడుతున్న నయీం భాయ్. ఫోటో సౌజన్యం: మహమ్మద్ సాబరుద్దీన్.

నా పేరు మంజు. నాకు యూనియన్ నిర్వహణ రంగంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. అమెజాన్ వేర్‌హౌస్‌లలోని పని పరిస్థితులను స్వయంగా చూసిన తర్వాత, గత నాలుగేళ్లుగా నేను భారతదేశంలోని ‘జన్ పహెల్’  (Jan Pehel), ‘GIPSWU’ మరియు ‘గిగ్ వర్కర్ ఇండియా’ (Gig Worker India) వంటి పలు గిగ్ వర్కర్ యూనియన్లతో కలిసి పనిచేశాను. గిగ్ ఎకానమీకి చెందిన 20కి పైగా వివిధ ప్లాట్‌ఫారమ్ కంపెనీల కార్మికులను సంఘటితం చేయడంతో పాటు, గిగ్ కార్మికుల హక్కుల పరిరక్షణకు చట్టం తీసుకురావాలని కోరుతూ రాష్ట్ర కార్మిక శాఖలతో జరిగిన వివిధ రంగాల సంప్రదింపులలోనూ నేను పాల్గొన్నాను.

గిగ్ కార్మిక సంఘ నిర్వాహకులుగా, కార్మికుల సమస్యలను ప్రజల దృష్టికి తీసుకురావడం, నిరసనలు నిర్వహించడం, మా డిమాండ్ల కోసం పోరాడటం మా లక్ష్యం. కానీ విద్యా, మీడియా, రాజకీయ, ఇతరేతర ప్రభావవంతమైన వర్గాలలోని ఉన్నతాధికారులను సంప్రదించడానికి అవసరమైన పరిచయాలు, నెట్‌వర్క్‌లు మాకు లేవు. పరిశోధకులు డాక్యుమెంట్స్ సిద్ధం చేయడంలోనూ, వాటిని సమర్పించడంలోనూ నిపుణులు. వారు ఆంగ్లంలో రాస్తారు, మాట్లాడతారు. కానీ మన సంభాషణలో ఎక్కువ భాగం హిందీలోనే ఉంటుంది; అది ఈ ప్రభావవంతమైన వర్గాలకు అంత సులభంగా చేరదు. పరిశోధకులు తమ రచనలను ప్రచురించి, తమ పరిచయాల ద్వారా వాటిని వ్యాప్తి చేస్తారు. వారికి క్షేత్రస్థాయిలో అనుభవం తక్కువగా ఉన్నప్పటికీ, వారు ప్రాజెక్ట్ ప్రతిపాదనలు, పత్రికా ప్రకటనలు, పోస్టర్లు, సమావేశాల గమనికలు మొదలైనవి తయారు చేయడంలో సహాయపడగలరు. ఇవన్నీ కార్మిక సంఘాలకు చాలా ఉపయోగకరమైన నైపుణ్యాలు.

నిజం చెప్పాలంటే, పరిశోధకులను తమ కోసం పని చేయించుకోవడంలో యూనియన్లు గానీ కార్మిక సంఘాలు కానీ చాలా చాకచక్యంగా ఉంటాయి! చాలా మంది పరిశోధకులు కష్టపడి పనిచేస్తారు, మంచి వైఖరిని కలిగి ఉంటారు, ఇంకా ‘కాదు’ అని చెప్పడానికి ఇబ్బంది పడతారు. చాలాసార్లు పరిశోధకులు తమ పని కంటే కార్మిక సంఘాల పనులలోనే ఎక్కువగా నిమగ్నమై ఉంటారు.

పరిశోధకులు గిగ్ వర్కర్ల సంస్థలకు ఎలా సహాయపడగలరనే దానిపై నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. మొదటగా, మీ పరిశోధన ఫలితాలను కార్మికులతో పంచుకోండి మరియు మా నిజమైన కథలను వెలుగులోకి తీసుకురండి. కార్మికుల సమస్యల గురించి ఇతరులు రాయడం చూసినప్పుడు మాకు సంతోషంగా ఉండడమే కాకుండా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మురికివాడలో నివసించే ఒక కార్మికుడి ఫోటో పత్రికలో వస్తే వారు ఎంత గర్వపడతారు? వీలైతే, మీ అధ్యయనంలో పాల్గొన్న కార్మికులను గుర్తించి, గౌరవించండి. వారిని ఒక సినిమా ప్రదర్శనకు, పుస్తకావిష్కరణకు లేదా మీడియా కార్యక్రమానికి ఆహ్వానించండి. ఇది మాకు గొప్ప గౌరవం. ఇది మరింత మందిని ఈ పోరాటంలో చేరడానికి ప్రేరేపిస్తుంది. అలాగే, కొత్త వ్యక్తులతో సంబంధాలు ఏర్పరచుకోవడానికి, మా పరిచయాలను విస్తరించుకోవడానికి కూడా ఇది మాకు సహాయపడుతుంది. కాబట్టి మీరు రాసిన పుస్తకాలు, వ్యాసాలు లేదా వీడియోలను మాతో పంచుకోండి. ఎవరైనా నా చిరునామా అడిగి నాకు ఒక పుస్తకం పంపితే నేను చాలా సంతోషిస్తాను. నేను దానిని అందరికీ చూపిస్తాను, సోషల్ మీడియాలో పంచుకుంటాను. అది మాకు కీర్తి ప్రతిష్టలను తెస్తుంది.

మీరు మాకు సహాయపడగల మరో మార్గం, మాకు కొన్ని నైపుణ్యాలు నేర్పించడం. పత్రికా ప్రకటనలు రాయడం, నోట్స్ సిద్ధం చేసుకోవడం, పోస్టర్లు తయారు చేయడం, ఆన్‌లైన్ సమావేశాలు నిర్వహించడం – ఇవి పరిశోధకులు రోజూ చేసే అనేక పనులు. కానీ మీ అధ్యయనం పూర్తయ్యాక, మీరు వెళ్ళిపోతారు. కాబట్టి, కనీసం వారానికి ఒకసారి లేదా నెలకు కొన్ని గంటలైనా, మాకు ఈ నైపుణ్యాలు నేర్పించండి. ఈ విధంగా, మేము ఈ పనులను స్వతంత్రంగా చేయగలుగుతాము; మేము ఎవరి దయ మీద ఆధారపడవలసిన అవసరం ఉండదు.

కేవలం కొన్ని నెలల్లోనే మీరు చాలా నేర్చుకోవచ్చు. ఉదాహరణకు, Xలో ఎలా పోస్ట్ చేయాలి? లింక్డ్‌ఇన్‌ను ఎలా ఉపయోగించాలి? AI సాధనాలను ఎలా ఉపయోగించాలి? కాన్వా ఉపయోగించి పోస్టర్లు ఎలా తయారు చేయాలి? ఇలాంటివి మాకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఈ రోజుల్లో, ఇంగ్లీషు తెలియడం కూడా చాలా ముఖ్యం. లేకపోతే మంచి వేతనాలు మరియు ఎన్నో అవకాశాలను కోల్పోతారు. కాబట్టి, మీరు మాతో ఉన్నప్పుడు మాకు కొంత ప్రాథమిక ఇంగ్లీష్ మాట్లాడటం నేర్పితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

కానీ యూనియన్లు పరిశోధకులపై చాలా ఎక్కువ పని భారాన్ని మోపుతాయి. ఒక వ్యక్తి ఎంత పనని చేయగలరు? పరిశోధకులు పూర్తిగా మమ్మల్ని విడిచిపెట్టకుండా, మాతోనే అనుబంధంగా ఉండాలని నేను సూచిస్తున్నాను. బహుశా ఒక గ్రూప్‌ను ఏర్పాటు చేసి, అటువంటి నైపుణ్యాల గురించి మన సందేహాలను నివృత్తి చేసుకోవడానికి మరియు అనుసంధానంగా ఉండటానికి పరిశోధకులు అప్పుడప్పుడు టచ్ లో ఉండాలి.

చివరగా, మీ అధ్యయనంలోని నిర్వాహకులకు ఆర్థికంగా మద్దతు ఇవ్వడానికి సృజనాత్మక మార్గాలను కనుగొనమని నేను పరిశోధకులను కోరుతున్నాను. ఉదాహరణకు, మా ఆర్థిక అస్థిరతను అధిగమించడానికి కొన్ని నెలల పాటు చిన్న నెలవారీ మొత్తాలను పంపడం, లేదా ప్రాజెక్టులలో మమ్మల్ని సహకారులుగా చేర్చుకోవడం వంటివి చేయవచ్చు.


ఈ పోస్ట్‌ను కంట్రిబ్యూటింగ్ ఎడిటర్ మిస్రియా షేక్ అలీ రూపొందించారు మరియు కంట్రిబ్యూటింగ్ ఎడిటర్ కనిక్కా సెర్సియా సమీక్షించారు.

గమనికలు

[1] శృతి వింజమూరి హాంబర్గ్‌లోని యునెస్కో ఇన్‌స్టిట్యూట్ ఫర్ లైఫ్‌లాంగ్ లెర్నింగ్‌లో గ్లోబల్ నెట్‌వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్ (GNLC)లో పనిచేస్తున్నారు. ఆమె పనిలో భాగంగా, నగరస్థాయి నిర్వాహకులకు వారి నగరాల్లో జీవితకాల అభ్యాస పురోగతిని మెరుగ్గా పర్యవేక్షించడంలో మరియు మూల్యాంకనం చేయడంలో మద్దతు ఇవ్వడం, అలాగే GNLC నగరాల్లోని వృద్ధ నివాసితులకు ప్రాథమిక డిజిటల్ నైపుణ్యాలను పెంపొందించుకోవడంలో సహాయం చేయడం వంటివి ఉంటాయి.

కృతజ్ఞతలు

ఈ వ్యాసం రాసే ప్రక్రియలో తమ సమయాన్ని వెచ్చించిన మంజు, నయీమ్ భాయ్ మరియు జావేద్‌లకు గౌరవ పారితోషికం అందించడానికి నిధుల సమీకరణను నిర్వహించిన లేబర్ టెక్ రీసెర్చ్ నెట్‌వర్క్‌కు మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ నిధుల సమీకరణకు స్పందించి, విరాళాలు అందించిన వ్యక్తులందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. వారి సహకారం లేకుండా ఈ వ్యాసం సాధ్యమయ్యేది కాదు. ఈ కృషిని సమన్వయం చేసిన కావేరి మేదప్పకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ వ్యాసాన్ని హిందీ, కన్నడ మరియు తెలుగు భాషల్లోకి అనువదించడంలో తమ ఉదారత మరియు శ్రద్ధ చూపిన అంబికా టాండన్, కావేరి మేదప్ప మరియు వింజమూరి శృతి రంజనికి మా హృదయపూర్వక ధన్యవాదాలు.

మూలాలు

నాగర్, రిచా. 2019. హంగ్రీ ట్రాన్స్‌లేషన్స్: రిలర్నింగ్ ది వరల్డ్ త్రు రాడికల్ వల్నరబిలిటీ. చాంపైన్, IL: యూనివర్శిటీ ఆఫ్ ఇల్లినాయిస్ ప్రెస్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *